సూపర్ మేన్, అపర భీముడు, ఇంటెలిజెంట్, అనితర సాధ్యుడు అంటూ షాడోని మెచ్చుకుంటున్న షాడో అభిమానులకు నమస్కారం.
నిజానికి పైన చెప్పిన మాటలేవీ షాడోకి వర్తించవు. షాడో ఒక హ్యూమన్ బీయింగ్. అయితే అతని గుండె మాత్రం, ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ గుండెకంటే కొంచెం పెద్దది. తోటి మనిషి బాధను అతను చూడలేడు. అన్యాయాన్ని ఎంతమాత్రం సహించలేడు.
రాజకీయ నాయకుల మాదిరి ఉపన్యాసాలతో దేశ సేవ, సంఘ సేవ చేయటం, అతని ప్రవృత్తికి విరుద్ధం. ప్రాణాలు పోయినా సరే, అప్పటికప్పుడు అటో ఇటో తేల్చుకోవాలన్నది అతని నైజం.
ఆ గుండె అతనికి, స్నేహితుల్ని ఎంతమందినో సంపాదించి పెట్టింది. అలాగే ఆ సంఖ్యకి రెట్టింపు శత్రువుల్ని కూడా క్రియేట్ చేసింది.
రాజస్థాన్ స్మగ్లర్స్ రామ్ దయాళ్ - అతని నలుగురు సోదరులూ, బీహార్ బందిపోటు ఠాకూర్ రాంచంద్, ముంబయి రౌడీ శంకర్ దాదా, రామ్ భక్త హనుమాన్, మార్నింగ్ స్టార్ దిన పత్రిక యజమాని శ్రీనివాస్, ఇలా ఎంతో మంది అతని కోసం ప్రాణాలు పెట్టేటంత సన్నిహితులు. ఆఖరికి పాకిస్తాన్ బందిపోటు మహమ్మద్ కూడా అతని దోస్తే.
ఆ ఏరియాలో సంచరించే ఫకీర్ బాబాకి అయితే, షాడో అంటే వల్లమాలిన ఆపేక్ష.
పాకిస్తాన్ కే చెందిన నాట్య రాణి చాందినీ, షాడోకి మరీ మరీ మరీ సన్నిహితురాలు.
ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అలాంటి రేంజ్ కి చేరుకోవటం ఎలా జరిగిందనే అంశం మీద, ఎంతో మంది ఎన్నెన్నో రకాలుగా ఎనలైజ్ చేసి చూశారు.
మంత్రాలూ, మాయలూ షాడోని ఆ స్థాయికి తీసుకు పోలేదు. అనుక్షణం ప్రమాదాలతో తలపట్లు పడుతూ బతకటం వల్ల, ప్రమాదాలను కంటికి కనిపించకముందే పసికట్టగల సిక్స్త్ సెన్స్ అతనికి అలవడింది.
గంటలకు గంటలు, రోజుల తరబడి కుంగ్ ఫూ ప్రాక్టీస్ చేయటం వల్ల, అమితమైన గట్టిదనం వచ్చింది. నిలబడిన చోట కూర్చోకుండా, కూర్చున్న చోట నిద్ర పోకుండా - ఆగమ్మ కాకిలా దేశాల వెంట పడి పరుగులు తీయటం వల్ల, ఎన్నెన్నో భాషలతోనూ, సంప్రదాయాలతోనూ పరిచయం ఏర్పడింది. ఎటువంటి వాతావరణంలోనైనా హ్యాపీగా సంచరించే తత్వం అలవడింది.
అన్నిటినీ మించి, షాడో ఒక మనసున్న మనిషి.
అతను గనుక మాట ఇస్తే, దానికి తిరుగు అనేది ఉండదని - అతని నాశనాన్ని కోరుకునే శత్రువులు కూడా ప్రగాఢంగా విశ్వసిస్తారు.
కిల్ అండ్ కాంకర్, రేప్ అండ్ రాబరీ మూల సూత్రాలుగా, ప్రపంచాన్నంతా స్వాధీనంలోకి తెచ్చుకుని, ఏక ఛత్రాధిపత్యం సాధించాలని కోరుకునే కిల్లర్స్ గ్యాంగ్ - షాడోని తనతో కలుపుకోవటానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసింది. రెఫ్యుజ్ చేశాడు షాడో.
దాంతో మూడుకోట్ల రూపాయల దగ్గర్నించీ మొదలుపెట్టి - అతని తలను తెచ్చి చూపించిన వారికి, మూడు వందల కోట్లు బహుమతి ప్రకటించింది ఆ గ్యాంగ్. ఇది జరిగి చాలారోజులు అయింది. బహుశా ఆ ప్రైజ్ మనీ విలువ వెయ్యి కోట్లు దాటి ఉండవచ్చు - ఇప్పటి లెక్కల్లో.
నీడ వంటి షాడోని పట్టుకోవటానికి ప్రయత్నాలు చేసి చేసి, చేతులు ఎత్తేసింది పోలీస్ డిపార్ట్ మెంట్. ఎందుకు పట్టుకోలేక పోతున్నామని అంతర్మధనం చేసుకుంటున్న సమయంలో తేలింది ఏమిటంటే, షాడోని పట్టుకోలేకపోవటానికి కారణం - అతనికి తోడుగా అతని స్నేహితుడు గంగారాం ఉండటమేనని..
పొట్టిగా, లావుగా, పిచ్చివాడిలా కనిపించే గంగారాంకి తోడు, నీడ, ప్రాణం, అన్నీ షాడోనే..
అతను పక్కన ఉండగా షాడోని పట్టుకోవటం ఇంపాజిబుల్ అని గ్రహించి - ముందుగా అతన్నే క్యాచ్ చేయటానికి ట్రై చేశారు అధికారులు.
నీడలాంటి షాడోకే నీడవంటి గంగారాం, పోలీస్ అధికారులకు దొరుకుతాడా..?
ఇద్దరూ కలిసి కాశ్మీర్ నించి కన్యాకుమారి దాకా కార్చిచ్చు, ఈదురు గాలి మాదిరిగా సంచరించారు!