త్వరలో 'ఎ బుల్లెట్ ఫర్ షాడో' - 2023 జనవరి 6 న ప్రారంభం..
షాడో, బిందుల సన్నివేశం:
కరాటే బ్లాక్ బెల్ట్ పాట్రన్స్ ను ప్రాక్టీస్ చేస్తున్న షాడో, బిందు ను చూసి డిస్టర్బ్ అయి కింద పడిపోవడం, వెక్కిరింతగా నవ్విన బిందు ను షాడో పట్టుకోవటానికి ప్రయత్నిస్తుండగా, కులకర్ణి గారి అంబాసిడర్ తో చంద్ర అక్కడికి రావడం, బిందు కోపాన్ని గమనించి , అంబాసిడర్ టైర్ కి ఏదో అయినట్టు చంద్ర కారును తిట్టుకోవడం సరదాగా అనిపిస్తుంది!
కేప్ టౌన్ ఒంటెల మార్కెట్ సన్నివేశం:
ఒంటి కంటితో, సగం తెగిపోయిన తోక తో వుండే ఓల్డ్ బేగ్ ను మార్కెట్ వ్యాపారి తను చెప్పిన ధరకు ఇష్టమైతే కొనమని, ఇష్టం లేకపోతే మరొక వ్యాపారి వద్దకు వెళ్ళమని షాడో కు చెప్పటం, ఆ మార్కెట్ లో మరొక ఒంటె లేకపోవడం వల్ల, ఎడారిలో ప్రయాణానికి ఒంటె అవసరం ఉండటం వల్ల వ్యాపారి చెప్పిన ధర కే షాడో ఓల్డ్ బేగ్ ను కొనడం, మార్కెట్ వదిలిపెట్టి వెళ్లడం ఇష్టం లేని ఓల్డ్ బేగ్ యజమానిని అసలు లెక్కచేయకపోవడం షాడో దెబ్బకు అంతకుముందు ఎప్పుడు లేనంత వేగంగా పరిగెత్తడం, అది చూసి ఒంటెల వ్యాపారి బంగారం లాంటి ఒంటెను తక్కువ ధరకు అమ్మానే అని బాధగా అనుకునే సన్నివేశం బాగుంది!
షాడో టర్నర్ ల మధ్య సన్నివేశాలు:
నవలా రచయితను అంటూ పరిచయం చేసుకొని, షాడో కు ఎదురుపడిన ప్రతిసారి అతను చేస్తున్న పనులను గురించి చెబుతూ, షాడో పంచ్ లకు తల్లక్రిందులు అవుతుంటాడు టర్నర్! ఆ సన్నివేశాలు బాగుంటాయి! ఓల్డ్ బేగ్ ను దాచి, షాడో ను ట్రిప్ చేయటం కూడా బాగుంటుంది!
కల్ హారీ డెసర్ట్ సన్నివేశం:
కరీబా గూడెం మనిషి కోసం ఓల్డ్ బేగ్ మీద ఎడారి లోకి అడుగుపెట్టిన షాడోను, ఎడారి త్రాచు బుస విని, ఓల్డ్ బేగ్ కింద పడేసి వెళ్ళిపోవటం, నిస్సహాయంగా, పళ్ళు కొరుకుతూ నిలబడిపోయిన షాడోను తన బుసలతో ఎడారి త్రాచు బెదిరించడం, "ఆల్ రైట్ గెలుపు నీదే" అని పామును ఉద్దేశించి షాడో అని, తన దారి మార్చుకొని వెళ్ళటం బాగుంటుంది!
షాడో ఎదురు చూస్తున్న కరీబా గూడెపు వాసులుగా మొజాంబో అనుచరులు అతన్ని కలుసుకోవడం, సిక్స్త్ సెన్స్ చేస్తున్న హెచ్చరికల్ని నిర్లక్ష్యం చేయకుండా షాడో అలర్ట్ గా వుంటూ వారి వెనకాల వెళ్లడం, దారి మధ్యలో వారి దాడిని ఎదుర్కొని, తిరిగి తను కలుసుకోవాల్సిన వ్యక్తి కోసం వెనక్కి వచ్చి, అక్కడ తన గురించి ఎదురు చూస్తున్న మనిషిని చూసి ఆశ్చర్యపోవడం (కెటీనా అని ముందుగా తెలియక పోవడం వల్ల ) బాగుంటుంది!
కరీబా గూడెం సన్నివేశాలు:
కరీబా గూడెపు మంత్రవాది మొజాంబో కులదేవత ఆదేశం అంటూ నాగరికుల మీద దాడి చేయడం కోసం ఎడారి జాతులన్నిటిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయటం, షాడో సహాయంతో మొజాంబో కుట్రల నుండి తన వారిని కాపాడుకోవాలి అని కెటీనా ఆరాటపడటం బాగుంటుంది! ఎడారి భూతం వలన షాడో కి ప్రమాదం ఎదురవుతుంది అని కెటీనా భయపడటం, షాడో ఆమెను కన్విన్స్ చేసి, ఎడారి భూతాన్ని ఎదిరించడానికి సిద్దపడటం బాగుంటుంది!
థ్రిల్లింగ్ సన్నివేశాలు:
ఓల్డ్ బేగ్ ను ఎడారి సింహాలు వెంటాడుతుండగా, ప్రమాదకరం అని తెలిసి కూడా ఓల్డ్ బేగ్ పరిస్థితి చూసి, చలించిపోయి దానిని రక్షించడానికి ఎడారి సింహాలను షాడో ఎదిరించే సన్నివేశం థ్రిల్లింగ్ గా ఉంటుంది!
తన మీద కరీబా జాతికి నమ్మకం కలిగించడానికి మొజాంబో సవాల్ ని స్వీకరించి ఎడారి భూతాన్ని ఎదిరించడానికి షాడో సిద్దపడటం, షాడో కి తెలియకుండా టర్నర్ అతని వెనకాల వెళ్ళటం.. ఇద్దరూ కలిసి ఎడారి భూతాన్ని ఎదిరించే సన్నివేశం కూడా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది!
టెన్షన్ గా అనిపించిన సన్నివేశం:
షాడో టర్నర్ లు మొజాంబో చేతిలో బందీలుగా చిక్కిన సమయంలో వారిని ఎడారి భూతానికి ఎరగా వేసి, షాడో మోసగాడు అని కరీబా గూడెంలో అందరినీ నమ్మించి, అతను అక్కడికి రావటానికి కారణం అయిన కెటీనానూ, ఆమె తండ్రినీ కులదేవతకు బలి ఇవ్వటానికి మొజాంబో, అతని అనుచరులూ ప్రయత్నించే సన్నివేశం టెన్షన్ గా అనిపిస్తుంది!
నాకు నచ్చిన సన్నివేశాలు! - శ్రీకాంత్ రెడ్డి ముత్తారెడ్డి