స్వాతి సపరివారపత్రిక - 'వసంతోత్సవం' లో ఓ సన్నివేశం.. మధుబాబు
రేవంతుడు తిరిగి వచ్చేంత వరకు ఏదో ఒక కాలక్షేపం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు భార్గవుడు. కోపం వస్తే ఆ కోడె దూడ ఏం చేస్తుందో ఎలా ప్రవర్తిస్తుందో తెలుసు కాబట్టి తడబాటు లేకుండా కదిలాడు.
"నీకు చేతనైతే నన్ను క్రిందికి నెట్టు... నీ పాదాలతో నన్ను తీవ్రంగా గాయపరచవచ్చు" అంటూ ఒక అడుగు అవతలికి జరిగాడు. అతన్ని పొడిచి వెల్లకిలా పడవేయాలని అనుకున్న ఆ దూడకి అసాధ్యం అయిపోయింది అతడిని పొడవడం... మరింత పెద్దగా బుస కొడుతూ గిరుక్కున అతని కేసి తిరిగింది. ఇంకో అడుగు అవతలికి వేసి అరచేత్తో దాని వెన్నుమీద అలవోకగా తట్టాడు భార్గవుడు. అవమానం అధికం అయిపోయింది దూడకి. ఆగ్రహం రెండింతలు పెరిగిపోయింది. గిట్టలతో నేలను దువ్వుతూ ఇంకోసారి అతని మీదకి దుమికింది. నవ్వుతూ మళ్లీ తప్పించుకున్నాడు భార్గవుడు. వెంట్రుకవాసి దూరంలో నుంచి పోయి ముందుకు తూలింది దూడ.
జొన్నల్ని శుభ్రంగా దంచి చిక్కటి జావను తయారు చేసింది రేవంతుడి భార్య... నంజుకునేందుకు రుచికరమైన ఊరగాయ ముక్కల్ని పెట్టి ఇంటి వెలుపలికి వచ్చింది భార్గవుడికి ఇవ్వటానికి. ఇంటి ఎదుట కనిపించిన దృశ్యం ఆమెను ఆశ్చర్య చకితురాలిని చేసేసింది.
క్షణక్షణానికి అధికం అయిపోతున్న కోపంతో రాక్షసి మాదిరి రోజుతోంది దూడ. భార్గవుడి అంతు చూసి తీరాలన్న పట్టుదలతో గంతులు వేస్తోంది. దూరంగా పారిపోవటం లేదు భార్గవుడు. ఆ దూడకు బెత్తెడు దూరంలోనే కదులుతున్నాడు. దాని తలకు గాని పాదాలకు గాని అందటం లేదు.
కర్ర సాము చేస్తున్నప్పుడు నృత్యం చేస్తున్నట్టు కనిపించిన అతని పాదాలు ఇప్పుడు కూడా అదే మాదిరి లయబద్ధంగా కదులుతున్నాయి. పావు ఘడియ, అర్థ ఘడియ గడిచిపోయిన తర్వాత కూడా భార్గవుడిని పడగొట్టలేకపోయింది కోడెదూడ...
కనీసం అతన్ని తాకను కూడా తాకలేకపోయింది అది. ఎంత వేగంగా కదులుతుందో అంతకు రెట్టింపు వేగంతో అవతలికి వెళ్ళిపోతున్నాడు అతను. అరచేత్తో దాని వెన్ను మీద తట్టి దాన్ని మరింతగా రెచ్చగొడుతున్నాడు.
అలుపు వచ్చేసింది దూడకి. అణిగిపోయింది దాని ఆగ్రహం. ఆఖరి సారిగా ఒక చిన్న బుస కొట్టి పాకలోకి పారిపోయింది. అరుగు మీద రేవంతుడి సతీమణిని గమనించి చిన్నగా నవ్వాడు భార్గవుడు.
"కోపం ఎక్కువైపోవడం వల్ల దానికి ఆలోచన లోపించింది. గంతులు వేయకుండా ఒక్క క్షణం పాటు కుదురుగా నిలబడి తలను విసిరితే నేను దొరికిపోయి ఉండేవాడిని" అన్నాడు.

