ఒకమాట!
కాశీమజిలీ వంటి షాడో గాధల్లో, గంగారాంతో అతనికి పరిచయం ఎలా అయిందో తెలియజెప్పే మజిలీ, అతి ముఖ్యమైనది, అత్యంత రమణీయమైనది.
భోలాశంకర్ పేరుతో స్వాతి పాఠకులకు పరిచయం చేయబడిన ఆ వర్తమానం గురించి ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించవలసిన అవసరం లేకపోయినా, మొదటినుంచి షాడో కథల్ని క్లోజ్ గా ఫాలో అవుతున్న పాఠకులకు మాత్రమే తెలిసిన కారెక్టర్స్ కొన్ని, ఈ సీరియల్ (మిడ్ నైట్ ఎడ్వంచర్ ) లోకి ఎంటర్ అయినందువల్ల, కొద్దిపాటి వివరణ ఇవ్వటం తప్పనిసరి అయింది.
చేయని నేరానికి జైలు శిక్షను అనుభవించి, దొంగగా ముద్ర వేయించుకున్నాడు షాడో. తోడ బుట్టిన వాడికంటే ఎక్కువగా తనను అభిమానించిన లలితనూ, స్నేహితుడు వేణునూ పోగొట్టుకుని, అందుకు కారకులైన వారి మీది కచ్చతో, నిజంగానే దొంగ అయినాడు.
దొంగతనాల గురించీ, దొమ్మీల గురించీ షాడోకి తెలియ చెప్పిన వాడు, కణ్ణస్వామి అనే ఒక మాజీ దొంగ.
బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో, పందెంకట్టి గవర్నర్ జనరల్ నివసించే భవంతినే కొల్లగొట్ట సాహాసించిన గడుసు పిండం, ఆ కణ్ణస్వామి.
అడవులకు అడవుల్నే ఆహారంగా తీసుకునే కార్చిచ్చుకు, ఈదురుగాలి తోడు ఎలా అవుతుందో, దొంగగా మారిన షాడోకి గంగారాం అలా స్నేహితుడు అయినాడు. గంగారాంతో పాటు, రాజస్థాన్ స్మగ్లర్స్ కొంతమంది కూడా షాడోకి ఆప్తులుగా మారారు.
పంచ పాండవుల మాదిరి అయిదుగురు సోదరులు, ఆ స్మగ్లర్స్. పెద్దవాడు రామ్ దయాళ్.. తరువాత రంగరాజు, ధనుష్కోటి, దీనబంధు, తుకారాం మొదలైనవి వారి పేర్లు.
సరిహద్ధు రాష్ట్రమైన రాజస్థాన్ లో నివశిస్తూ వుండటం వల్ల, పాకిస్థాన్ లో వుండే రకరకాల మనుషులతో పెద్ద పెద్ద పరిచయాలు వున్నాయి ఆ సోదరులకు.
ప్రస్తుతం స్వాతి పాఠకులు చదువుతున్న ఈ మిడ్ నైట్ అడ్వంచర్ లోని ఎముకల వైద్యుడు డాక్టర్ అబ్బాస్ అలీ, అటువంటి వారిలో ఒకడు.
అందుకే, రామ్ దయాళ్ సోదరుల ద్వారా అతి తేలికగా షాడోని కాంటాక్ట్ చేయగలిగాడు అతను.
దొంగగా సంచరించే రోజుల్లో, రాజస్థాన్ లోని గిరాబ్ గ్రామంలో నందన్ లాల్ అనే కోటీశ్వరుడిని దోచుకునే ప్రయత్నం చేశాడు షాడో.
కడుపున పుట్టిన బిడ్డను పాకిస్థాన్ లోని మహమ్మద్ అనే బందిపోటు కిడ్నాప్ చేసి తీసుకుపోతే, బిడ్డకంటే డబ్బే ముఖ్యమని ఎంచి, కామ్ గా కూర్చో గలిగిన కర్కోటకుడు, ఆ నందన్ లాల్.
కడుపు తీపి తన గుండెల్ని పిండి చేస్తున్నా, భర్త మనసును మార్చే శక్తి లేకపోవడం వల్ల, ఆ బాధను మనసులోనే దాచుకుని తపించిపోతున్న ఆ నందన్ లాల్ భార్య ముఖం చూసి, వారి వంశాంకురం కోసం పాకిస్థాన్ లోకి పోయాడు షాడో.
అసలు పనుల్ని వదిలేసి, కొసరు పనుల కోసం ప్రాణాల మీదికి తెచ్చుకోవటం, షాడోకి బాగా అలవాటు. చంఘీజ్ ఖాన్ అనే ఒక దేశద్రోహి అష్రాప్, సిటీకి దగ్గిర్లోని షాకర్ డామ్ ని ధ్వంసం చేసి, ప్రజలందరూ చెల్లా చెదురు అవుతున్న సమయంలో, ఆ సిటీని దోచుకోవటానికి పథకం వేశాడు.
బందిపోటు మహమ్మద్ సహాయంతో ఆ పథకాన్ని అడ్డుకుంటాడు, షాడో. ఆ బందిపోటుకు ఆప్తుడు అవుతాడు.
ప్రాణాలు పోయేటంతవరకూ స్నేహితులుగానే వుంటామని అగ్నిసాక్షిగా ప్రమాణాలు చేసుకున్నారు వారిద్దరూ.. తామే కాదు - తమకు పుట్టబోయే సంతానం కూడా అలాగే వుండి తీరాలని కూడా అనుకున్నారు. అందుకు సాక్ష్యంగా, తమ గుండెల మీద పచ్చబొట్లు పొడిపించుకున్నారు.
ఆర్తులకూ, అనాధలకూ సేవ చేయటం ఒక్కటే, భగవంతుడిని చేరుకునేందుకు మార్గమని భావించే ముస్లిం ఫకీర్ ఒకతను, బందిపోటు మహమ్మద్ కి బాగా పరిచయం.
ఫకీర్ బాబాగా అందరూ పలకరించే ఆ పవిత్ర హృదయుడికి, షాడో ఎటువంటి వాడో బాగా తెలుసు. అతను పాకిస్థాన్ లోకి అడుగు పెడితే ఏం జరుగుతుందో, ఇంకా బాగా తెలుసు!
ఈ పాత్రల ప్రవేశంతో ప్రారంభమయ్యే ఈ ఎడ్వెంచర్ మీకందరికీ నచ్చుతుందని ఆసిస్తూ.. - మధుబాబు
1996 లో స్వాతి వీక్లీలో వచ్చిన "మిడ్ నైట్ అడ్వంచర్" సీరియల్ లో మధుబాబు గారి మాట!
0 comments:
Post a Comment
Here You Can Communicate with me: