ఈ రోజుటి నుంచి 'భోళాశంకర్' (Audiobook Series) మొదలు.. 11 భాగాలుగా..
ముందుగా ఒక మాట!
పుట్టుకతోనే దొంగ కాదు షాడో. గ్రాడ్యుయేట్ అయికూడా ఉద్యోగం లభించక, పగలు మదన్ లాల్ అనే మార్వాడీ సేట్ ఇంట్లో పనిచేస్తూ, రాత్రిళ్లు రిక్షా తొక్కేవాడు. కొద్ది కొద్దిగా కూడ బెట్టిన సొమ్ముతో, ఏదైనా వ్యాపారం చేసుకుందామనీ, స్వతంత్రంగా బ్రతుకుదామనీ అతని కోరిక!
మార్వాడీ మదన్ లాల్ కంట పడిందా డబ్బు ఒకనాడు. సేవకుడిగా పనిచేసే మనిషి దగ్గర అంత మొత్తం నిలువ వుండే అవకాశం లేదని పోలీసుల్ని పిలిపిస్తాడు. ఆ డబ్బు తనదేనని అంటాడు.
నిజం చెబుతాడు షోడో.. తను పడుతున్న కష్టాన్ని వివరిస్తాడు. ప్రజలు నమ్మలేదు. పోలీసులు నమ్మలేదు.. కేసును విచారించిన న్యాయ మూర్తులు కూడా నమ్మలేదు అతని మాటల్ని. ఫలితంగా, సంవత్సరం పాటు జైలు శిక్షను అనుభవించవలిసిన గతి అతనికి పడుతుంది.
జైలు నుంచి తిరిగి వచ్చిన తరువాత కూడా, అతని వెన్నంటే నిలిచింది దురదృష్టం. ఉద్యోగం కాదుగదా, చిన్న కూలి పని కూడా లభించకుండా పోతుంది.
ఎక్కడ ఏ విధమైన దొంగతనం జరిగినా, వెంటనే వచ్చి తనను స్టేషన్ కి తీసుకుపోయి, లాఠీలతో విరగబాదే పోలీసులతోనూ, తననొక దొంగగానే భావించి అనుమానిస్తున్న సమాజంతోనూ పోరాటాన్ని సాగించలేక, నిజంగానే అడ్డదార్లు తొక్కబోయిన షాడోని ఆదుకుంటారు, అతని స్నేహితులు లలిత, వేణు. తాము పనిచేసే ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తారు.
అందుకు ప్రతిఫలంగా, లలిత మానాన్ని కోరతాడు ఫ్యాక్టరీ యజమాని మన్మోహన్ దాస్.
అప్పటికే జీవితం మీద పూర్తిగా విరక్తి చెంది వున్న షాడోని రక్షించుకునేటందుకు, అమానుషమైనా సరే, భర్త అనుమతి తీసుకుని తెగిస్తుంది లలిత.
కోరిక తీర్చుకుని ముఖం చాటుచేస్తాడు మన్మోహన్ దాస్. అడుగ వచ్చిన లలితను గూండాలకు అప్పగించి, తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటాడు.
అవమానాన్ని భరించలేక, తన తెగింపు నిరర్ధకమయిందనే బాధను భరించలేక, ఆత్మహత్య చేసుకుంటుంది లలిత. పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి పోయిన వేణును పోలీసుల చేతే హింసింపచేసి, రైలు కట్ట మీద పారవేయిస్తాడు, మన్మోహన్ దాస్.
న్యాయం మీదా, ధర్మం మీదా, ఆ రెంటినీ పరిరక్షించ వలసిన పోలీసుల మీదా నమ్మకం నశించి, అగ్ని పర్వతం మాదిరి బద్దలైనాడు షాడో.
అతని ధ్యేయం ఒక్కటే!
స్నేహంలోని మాధుర్యాన్ని తనకు చవి చూపించిన అమృతమూర్తులు లలిత, వేణుల మరణానికి ప్రతీకారం చేయాలి!!
తన జీవితాన్ని బాగు చేసేందుకు ఆ పుణ్య మూర్తులు ఎంతటి బాధను అనుభవించారో, అంతకు వెయ్యి రెట్లు అధికంగా, ఆ మన్మోహన్ దాస్ అనుభవించాలి!!
ఎదురు దెబ్బలు తినీ తినీ రాటుదేలిన హృదయంతో, ప్రమాదాల్ని ఎదుర్కొనీ ఎదుర్కొని, బండబారి పోయిన శరీరంతో, మనస్సు విప్పి మాట్లాడుకునే తోడులేక, ఏకాకిగా, అడవులకు అడవుల్ని కాల్చుకు తినే కార్చిచ్చు మాదిరి సంచరిస్తున్న ఆ షాడోకి, అయాచితంగా తారస పడతాడు గంగారాం.
పెట్టీ క్రైమ్స్ తో పొట్ట పోసుకుంటూ, చిన్న సైజు ఆకురౌడీ మాదిరిగా జీవించే గంగారం కలయికతో, విచిత్రమైన మలుపు తిరిగింది షాడో వ్యక్తిత్వం.
నవ్వడం అంటే ఏమిటో, నవ్వు అనేది ఎలా వుంటుందో పూర్తిగా మరచి పోయి, కరకు గుండెల కసాయి వాడిలా సంచరించే అతని పెదవులపై, తొలి సారి ఉదయిస్తుంది అస్పష్టమైన ఓ చిరు దరహాసం..
అగ్ని, వాయువుల సంగమం వంటి వారి కలయికను వర్ణించే కథ ఇది. కలిసిన క్షణం నుంచీ ఒకటైపోయిన వారి సాహస గాథలకు తొలిపలుకు. ..మీ మధుబాబు..
0 comments:
Post a Comment
Here You Can Communicate with me: