'షాడో వ్యక్తిగత జీవితం' మధుబాబు గారి మాటల్లో.. Part 3 of 4..
"ఎవరో ఏదో అన్నారని, అలాగే చేయటం మంచి పద్ధతి కాదు. ధైర్యం వుంటే సమస్యల్ని పరిష్కరించుకునేందుకు మార్గాలు అవే కనిపిస్తాయి..." అంటూ తన మెడలో వున్న గొలుసును షాడోకి ఇస్తుంది లలిత. ఇష్టంలేకపోయినా దాన్ని తీసుకు పోయి, డబ్బు తీసుకువస్తాడు రాజు. తల్లిదండ్రులకు దహన సంస్కారాలు చేస్తాడు.
మార్వాడీ సేటుకు ఇంటిని అప్పచెప్పి, నిలువ నీడ కూడా కోల్పోయిన అతన్ని తమ ఇంటికి తీసుకుపోతారు, వేణు-లలిత. అక్కడే వుండి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభిస్తాడు రాజు.
కానీ, దొంగతనం చేసి జైలు పాలయిన వారిని నమ్మి, ఎవరు ఇస్తారు ఉద్యోగం? అందరూ దొంగ-దొంగ అని వెక్కిరిస్తుంటే వినలేక కుమిలిపోతున్న రాజును ఊరడించి, ధైర్యాన్ని చెపుతారు ఆ దంపతులు. రాజుకూ తనకూ అక్రమ సంబంధం అంట గట్టి, చెవులు కొరుక్కుంటున్న ఇరుగు పొరుగు వారి మాటల్ని తేలికగా కొట్టి పారేస్తుంది లలిత.
"నీకు నాకు వున్న సంబంధం ఏమిటో నేను పూజించే దేవతలకు తెలుసు. నన్ను కట్టుకున్న నా దేముడికి తెలుసు. ఈ లోకుల మాటల్ని నేను కేర్ చెయ్యను..." అంటుంది. అలాగే ప్రవర్తిస్తుంది.
తిరగగా తిరగగా రాజు కథను విన్న ఒక దయా మయుడు, తన కంపెనీలో ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరిస్తాడు. మర్నాడు పది గంటలకల్లా ఆఫీసుకు రమ్మని చెపుతాడు. ఆనందంతో ఆ రాత్రి రాజుకు నిద్రపట్టదు. తన జీవితం బాగుపడి నట్లే అని అతను భావిస్తున్న సమయంలో, తెల్లవారుజామునే వచ్చి అతన్ని స్టేషన్ కి లాక్కుపోతారు, పోలీసులు. పక్క వీధిలో ఏదో దొంగతనం జరిగిందట! పాత దొంగ కాబట్టి, ఆ పని రాజే చేసి వుండచ్చు గదా!!
తనకేమీ తెలియదని గోల చేసినా వినిపించుకోకుండా, లాకప్ లో పడవేసి పదకొండు గంటలదాకా విరగబాది వదులుతారు పోలీసులు. పదకొండు గంటల సమయంలో వారికి తెలుస్తుంది, అసలు విషయం. దొంగ తనం చేసింది తన కుటుంబ సభ్యులేనని, ఇచ్చిన రిపోర్టును ఉపసంహరించుకుంటాడు ప్రక్క వీధి పెద్ద మనిషి.
అనవసరంగా అనుమానించటమే కాకుండా, అంతవరకూ చిత్ర హింసలు పెట్టిన విషయాన్ని విస్మరించి, బుద్ధిగా బ్రతకమని ఒక వార్నింగ్ తో రాజును వదిలేస్తారు పోలీసులు. పరుగు పరుగున పోతాడు రాజు. ఉద్యోగం ఇస్తానని చెప్పిన మహనీయుడి ఆఫీసుకు.
అతని కంటె ముందుగానే పోతుందక్కడికి అతని దురదృష్టం. అంతవరకూ ఎదురు చూసి చూసి, అప్పుడే కంపెనీ పనుల మీద ఫారిన్ వెళ్ళి పోతాడాయన. నిరాశా నిస్పృహలతో ఇంటికి వచ్చిన రాజును, మళ్ళీ ఊరడిస్తుంది లలిత.
తను పనిచేసే కంపెనీలో ఉద్యోగం ఇప్పించడం కోసం యజమానిని కలుసుకుంటుంది. ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరిస్తాడు యజమాని. ప్రతిఫలంగా లలిత శీలాన్ని కోరతాడు.
మళ్ళీ కలుద్దాం.. -మధుబాబు
సేకరణ: శ్రీకాంత్ రెడ్డి ముత్తారెడ్డి
Links: https://www.youtube.com/smbab..
0 comments:
Post a Comment
Here You Can Communicate with me: