'షాడో వ్యక్తిగత జీవితం' మధుబాబు గారి మాటల్లో.. Part 2 of 4..
తీరని దు:ఖంతో కుమిలిపోతున్న రాజును ఓదార్చేందుకు ఆ చుట్లుపట్ల నివసించేవారు ఎవరూ రాకపోయినా, ఆ వార్త తెలిసిన మరు క్షణం రెక్కలు కట్టుకుని వచ్చేస్తారు వేణు, లలిత.
రాజుకు బాల్య స్నేహితుడు వేణు. లలిత అతని అర్ధాంగి. తల్లడిల్లిపోతున్న రాజును ఓదార్చి, ధైర్యాన్ని చెపుతారు వారిద్దరూ. ఆ తరువాత జరుగవలసిన పనుల్ని కానీయమని బోధిస్తారు.
జైల్లో కూలి పనులు చేసినందుకు, రాజుకు కొంత డబ్బు ఇస్తుంది ప్రభుత్వం. ఆ డబ్బుతో తల్లిదండ్రుల అంతిమ యాత్రకు ఏర్పాట్లు చేయడానికి, సిద్ధ పడతాడతను. అదే సమయంలో, పది మంది రౌడీలను వెంటబెట్టుకుని అక్కడికి వస్తాడు, ఒక పెద్ద మనిషి.
రాజు జైల్లో వుండగా, అతని తల్లిదండ్రులకు కొంత డబ్బు అప్పు ఇచ్చి, ఇంటిని తాకట్టు పెట్టించుకుంటాడు. ఇప్పుడు ఆ బాకీ తీర్చమని బలవంతం చేస్తాడు. కొద్దిపాటి టైమ్ అడుగుతాడు రాజు.
తన వద్ద డబ్బు లేదని చెబుతాడు. అతని చేతిలోని నోట్లను చూపించి, అవేమిటని ప్రశ్నిస్తాడు, ఆ పెద్దమనిషి.
ఆ కొద్దిపాటి డబ్బుతో అతని అప్పు తీరదు.. అయినా ఆ సొమ్మును కాస్తా అతని పరం చేస్తే, అంత్య క్రియలు చేయడం ఎలా??
ఆ విషయమే అతనితో చెప్పి, బ్రతిమాలుకుంటాడు రాజు.
"కూటికి ఠికాణా లేని వాళ్ళకు అంత్య క్రియలేమిటి? మున్సిపాలిటీ వారికి మూడు రూపాయలు ఇస్తే, తీసుకు పోయి అవతల పారేయరా." అంటాడా పెద్ద మనిషి.
భగ్గుమంటుంది రాజు గుండె. పిచ్చి ఆవేశంతో అతని షర్టును పట్టుకుంటాడు. అందు కోసమే ఎదురు చూస్తుంటారు, పెద్ద మనిషి వెంట వచ్చిన రౌడీలు. రాజును చితక కొట్టి, ఆ డబ్బుతో మాయం అవుతారు. ఇరవై నాలుగు గంటల్లో ఇంటిని తన పరం చేయాలని అల్టిమేటమ్ జారీ చేసి వెళ్ళి పోతాడు, పెద్ద మనిషి.
ఎంతో మంది చూస్తారు ఆ దృశ్యాన్ని. ముందుకు వచ్చి ఇదేమిటని అడిగిన వాళ్లు వారిలో ఎవరూ వుండరు.
తల్లి దండ్రుల దహన సంస్కారాలకు కూడా డబ్బు లేకుండా పోవడంతో, బండబారి పోతుంది రాజు గుండె. తనను దొంగ అని అపనింద వేసింది సంఘం.
దొంగగానే చూస్తూ అవమానాల పాలు చేస్తోంది. నిజంగానే దొంగగా మారి డబ్బు సంపాదించుకు వస్తే?? చెంప పగిలి పోయేటట్లు కొడుతుంది అతని ఆలోచనల్ని గ్రహించిన లలిత.
ఆ తర్వాత.. - మధుబాబు
0 comments:
Post a Comment
Here You Can Communicate with me: