'షాడో వ్యక్తిగత జీవితం' మధుబాబు గారి మాటల్లో.. Part 4 of 4..
రాజుకు ఉద్యోగం ఇచ్చినందుకు ప్రతిఫలంగా, కంపెనీ యజమాని తనను ఆశిస్తున్నట్లు భర్తకు చెపుతుంది లలిత. బాధపడుతుంది. నిద్రపోకుండా ఆ రోజు రాత్రి ఆ భార్యాభర్తలు ఇద్దరూ తర్జన భర్జనలు పడటాన్ని గమనించలేకపోతాడు రాజు.
తన స్నేహితుడి జీవితాన్ని తీర్చిదిద్దటంకోసం, అతను సమాజపు అవహేళనకు బలైపోకుండా రక్షించటంకోసం, ఏ భర్తా తీసుకోని నిర్ణయాన్ని తీసుకుంటాడు వేణు. కంపెనీ యజమాని కోరికను అంగీకరించమని లలితకు చెపుతాడు.
తోడబుట్టిన సోదరుడికంటే ఎక్కువైన రాజు కోసం తన శీలాన్ని పణంగా పెడుతుంది లలిత. కంపెనీ యజమాని నీచపు బుద్ధికి లొంగిపోతుంది. క్షణ క్షణానికీ మారుతూ వుండే ఈ సమాజపు రాక్షస ప్రవృతిని అంచనా వేయటంలో తప్పటడుగు వేశారు ఆ దంపతులు.
లలిత మానాన్ని దోచుకుని, ఒక దొంగకు తన కంపెనీలో ఉద్యోగం ఎలా ఇవ్వగలనని అంటాడు ఆ దుర్మార్గుడు.
కంగుతిన్న లలిత ఎదురు తిరిగి నిలవేసే సరికి, పదిమంది రౌడీలను పిలిచి ఆమెను అప్పగిస్తాడు. ఆలోచించే శక్తిని కోల్పోతుంది లలిత. బాధపడటం కూడా మరిచిపోతుంది.
సూటిగా ఇంటికి వచ్చి ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. డ్యూటీనుంచి తిరిగివచ్చి ఆమె శవాన్ని చూస్తాడు వేణు. జరిగిందేమిటో వూహించి, పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేస్తాడు.
కంపెనీ యజమాని ధన బలం ముందు తల వంచుతుంది న్యాయం. రిపోర్టు ఇవ్వటానికి వచ్చిన వేణును లాకప్ లోకి నెట్టి, విరగ దీస్తారు పోలీసులు. అచేతనంగా పడిపోయిన అతడిని రైలు కట్ట మీదికి దొర్లిస్తారు. స్పృహలేని స్థితిలో నుంచి బయట పడకుండానే
ప్రాణాలు వదిలేస్తాడు వేణు.
తను నమ్మిన నీతికోసం, తన స్నేహితుడి కోసం భార్య ప్రాణాలనూ, తన ప్రాణాలనూ బలి ఇస్తాడు.
మనశ్శాంతి కోసం ఊరి బయటికి పోయి, చీకటి పడిన తర్వాత తిరిగి వచ్చిన రాజుకు తెలుస్తుంది ఆ విషయం.
అంతవరకూ అతన్ని పట్టి వుంచిన స్నేహబంధం తెగిపోయింది. రక్తాన్ని కోరే రాక్షసుడిలా, పట్టరాని బాధతో గుండెలు మండి పోతుండగా, నిప్పులు కక్కుతూ పోయి, కంపెనీ యజమాని ఇంటి మీద పడతాడు. అడ్డు వచ్చిన వారందర్నీ పిడికిటి పోట్లకు గురిచేసి,
ఆ ఇంటిని ఆగ్నికి ఆహుతి ఇస్తాడు.
రాజు ఆవేశాన్ని చూసి భయపడి పారి పోతాడు కంపెనీ యజమాని. మద్రాసు నగరాన్ని విడిచి ఎటో వెళ్ళిపోతాడు. అతని కోసం వెతుకుతూ కడుపు నింపుకోవటం కోసం దొంగ అయ్యాడు రాజు. సమాజం మీది కక్షతో గజదొంగ అయ్యాడు.
నీడనైనా పట్టుకోవచ్చుగానీ, రాజును పట్టుకోవటం కష్టమనే అభిప్రాయం అందరిలోనూ బలపడి, అదే అతని పేరు అయింది.
'షాడో'గా నామకరణం జరిగింది. రాజు 'షాడో'గా మారటానికి వెనుక గల విషాద గాథ ఇది.. మానవత్వాన్ని మరచి, అతను ఒక్కోసారి రాక్షసుడిలా ప్రవర్తించటానికి గల కారణం కూడా ఇదే..
ఈ విషయాలన్నీ వివరంగా గతంలో వచ్చిన నా షాడో పాస్ట్ లైఫ్ సిరీస్ లో వివరించ బడ్డాయి.. పుస్తకరూపంలో వున్న వాటిని తిరిగి సవివరంగా రాయటం అనవసరం అనే వుద్దేశ్యంతో, ఇక ముగిస్తున్నాను. అభినందనలతో.. -మధుబాబు
సేకరణ: శ్రీకాంత్ రెడ్డి ముత్తారెడ్డి
Links: https://www.youtube.com/smbab..
0 comments:
Post a Comment
Here You Can Communicate with me: